కాటేశ్వర ఆలయ కానుకల వివాదంపై ఇంటెలిజెన్స్ ఆరా

24-11-2026 | 08:37pm

వెంకటాపూర్, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయ(Ramappa Temple) సముదాయంలోని కాటేశ్వర ఆలయంలో(Kateswara Temple) భక్తులు సమర్పిస్తున్న కానుకల సేకరణ, నిర్వహణపై నెలకొన్న వివాదం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వ్యవహారంపై విజయక్రాంతి లో వార్త ప్రచురితమైన నేపథ్యంలో సంబంధిత అధికారులను ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

ఆలయ గర్భగుడిలో భక్తులు సమర్పిస్తున్న నగదును ఎవరు సేకరిస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమేర కానుకలు వచ్చాయి? సేకరించిన నగదును ఎక్కడ జమ చేస్తున్నారు? వాటికి సంబంధించిన లెక్కలు, రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కలు, వాటికి సంబంధించిన రికార్డులు బయటకు వస్తాయా?

నగదు జమ చేసిన వివరాలను అధికారులు వెల్లడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారా? ఈ వివాదానికి పరిష్కారం చూపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు