ఆలయం నిర్మాణం ఖమ్మం జిల్లాకు వరం
శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది
శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
కులమతాలకు అతీతంగా ధర్మమార్గంలో పయనించాలి
ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి
ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలి
ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ, శంకుస్థాపన
ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ప్రధాన కారణం : టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు
ఆలయ నిర్మాణానికి పలువురు దాతల విరాళాల ప్రకటన
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం(Khammam) ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ(Sri Venkateswara Swamy Temple) నిర్మాణం చేపట్టడం శుభసూచకమని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్ లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu), జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివ రావు, మట్టా రాగమయి దయానంద్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో శుభప్రదమని అన్నారు. దేశంలో ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా రైతులు, కుమ్మరులు సహా అన్ని వర్గాల ప్రజలు ముందుగా భగవంతుడిని స్మరించుకుని తమ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. భగవంతుడిని స్మరించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు టెలివిజన్ మాధ్యమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మం నగరానికి విచ్చేసేందుకు నేడు తొలి అడుగు పడిందని అన్నారు. ఆశ్వయుజ మాసం సోమవారం నాడు ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన జరగడం దైవ సంకల్పమని పేర్కొన్నారు. స్వామివారు ఖమ్మం నగరాన్ని పవిత్రం చేసేందుకు స్వయంగా ఇక్కడకు వస్తున్నారని, ప్రజలందరికీ ఆశీస్సులు అందించనున్నారని తెలిపారు.
వసుధైక కుటుంబ భావన మన ధర్మానికి మూలం:
మన దేశం, మన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఎలాంటి భేదభావాలు లేకుండా భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకోవడం భారతీయ సంస్కృతిలోని గొప్ప లక్షణమని పేర్కొన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వసుధైక కుటుంబ భావన మన ఆశయమని తెలిపారు.
శ్రీరాముడు బోయవాడిని, శబరిని, పక్షి రూపంలో ఉన్న జటాయువును, విభీషణుడిని కరుణించిన విషయాలను ప్రస్తావిస్తూ, భగవంతుని దృష్టిలో భక్తి, మంచి మనసు, ధర్మబద్ధమైన జీవనానికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. పదిమందికి మేలు జరగాలని కోరుకునే వారందరూ మనవారేనని, ఇతరులకు హాని కలగాలని కోరుకునే వారు శత్రువులుగా మారుతారని అన్నారు. కృష్ణుడిని ఆరాధించేవారు మనకు మిత్రులు, ద్వేషించేవారు శత్రువులు అనే భావనను బోధాదేవి చెప్పినట్లు ప్రస్తావిస్తూ, మన మంతా ఇదే ధర్మసూత్రాన్ని అనుసరించాలని సూచించారు.
నా జన్మ ధన్యమైంది : మంత్రి తుమ్మల
ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి, ఆలయ నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు, టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీరాముడి ఆశీస్సులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తయి ఈ ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖమ్మం ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల కృషి కీలకం: టీటీడీ చైర్మన్ బిఆర్
ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభం కావడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాన కారణమని అన్నారు. చిన్నతనంలో విక్రమార్కుడి గురించి చదువు కున్నామని, ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూపంలో అలాంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే ఏడాది కాలంలో ఐదు వేల ఆలయాలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. అలిపిరి వద్ద రూ. 2,700 కోట్లతో సమగ్ర టౌన్‌షిప్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, రద్దీ సమయాల్లో సుమారు 20 వేల మందికి వసతి కల్పించేలా ఈ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం: టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శరత్
"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి॥” అనే శ్లోకం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమను తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ప్రజా ప్రతినిధులు రాయల నాగేశ్వర రావు, విద్యుత్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, దేవాదాయ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.