సంపూర్ణ మద్యపాన నిషేధం
ఏకగ్రీవ తీర్మానం
రూల్స్ అతిక్రమిస్తే రూ. లక్ష జరిమానా
లింగంపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ గ్రామం(Polkampet Village)లో సంపూర్ణ మద్యపాన నిషేధం(Bans Alcohol) విధిస్తూ గ్రామ పంచాయతీ, గ్రామస్తులు కలిసి సోమవారం ఏకగ్రీవంగా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, పలువురు తీవ్ర అనారోగ్య సమస్యల(Health issues) బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలను అరికట్టేందుకు గ్రామ సర్పంచ్ దివిటి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజలందరి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇకపై గ్రామంలో మద్యాన్ని పూర్తిగా బంద్ చేయాలని అందరి సహకారంతో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ నిబంధనను ఉల్లంఘించి గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా లేదా నిల్వ ఉంచినా వారికి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సర్పంచ్ దివిటి రమేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు.