చిన్న వ్యాపారుల ఉసురు తీయొద్దు
సీఐటీయూ జిల్లా కార్యదర్శి విజేందర్
జనగామ,(విజయక్రాంతి): జనగామ స్ట్రీట్ వెండర్లను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్(CITU District Secretary Sunchu Vijender) డిమాండ్ చేశారు. సోమవారం స్ట్రీట్ వెండర్స్ యూనియన్(Street Vendors Union) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2014 చట్టం ప్రకారం హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం కల్పించాలని, టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు చేసి సర్వే చేసిన తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రధాన రహదారులపై షాపింగ్ మాల్స్ ముందు భారీ వాహనాల వల్లే ట్రాఫిక్ సమస్య వస్తుందని, 500 మంది చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బండార్ శంకర్, ఉపాధ్యక్షురాలు మల్లేష్ మధు తదితరులు పాల్గొన్నారు.