మురుసు తుపాను ప్రభావం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

04-11-2026 | 04:35pm

తిరుమలాయపాలెం నవంబర్ 4 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి విద్యుత్ తీగలు(Electric wires), వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దు. మురుసు తుపాను(Cyclone Murusu) ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీ జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ సూచించారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల్లో నీటి ప్రవాహం పెరిగే ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. నీటితో నిండిన కల్వర్టులు, చెరువులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.

విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారులు వర్షపు నీటిలో ఆడకుండా, గుంతలు, కాలువలు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని మందడి ఇజ్రాయిల్ కోరారు.

మరిన్ని వార్తలు