డిజిటల్ గవర్నెన్స్ పై అవగాహన కలిగి ఉండాలి

04-11-2026 | 05:58pm

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ

జగిత్యాల, నవంబర్  4 ( విజయ క్రాంతి ): ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ గవర్నెన్స్‌లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది  అందరూ అవగాహన కలిగి ఉండాలనీ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ(Collector (Revenue) N. Prasunamba) పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ) లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ - హెచ్ ఆర్ ఎం ఎస్, ఈ - సంక్షన్స్ మాడ్యూల్స్ వినియోగంపై జిల్లా అధికారులకు శిక్షణా కార్యక్రమం జిల్లా ట్రెజరీ శాఖ ద్వారా నిర్వహించారు.

బుధవారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఖజానా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ప్రవేశపెట్టిన ఈ - హెచ్ ఆర్ ఎం ఎస్, ఈ - సాంక్షన్స్ మాడ్యూల్స్ వినియోగ విధానం, వాటి ద్వారా నిర్వహించాల్సిన పరిపాలనా, ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు, ఆన్‌లైన్ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా మాడ్యూల్స్ వినియోగ సమయంలో అధికారులకు ఎదురయ్యే సందేహాలు, సాంకేతిక సమస్యలను నివృత్తి చేస్తూ, ఆయా ప్రక్రియలను ఆచరణాత్మకంగా వివరించారు. నూతన విధానాలను అధికారులు సమర్థవంతంగా వినియోగించుకునేలా అవసరమైన సూచనలు అందించారు.

ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ గవర్నెన్స్ విధానంలో భాగంగా నూతన ఆన్‌లైన్ మాడ్యూల్స్‌ను అధికారులు అవగాహనతో వినియోగిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి పద్మ, ఎస్ టి ఓ విజయ్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు