బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
రఘనాథపాలెం /ఖమ్మం,(విజయక్రాంతి )సెప్టెంబర్ 11: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు గురువారం ఒకరోజు సమ్మె చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ' పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పొట్ల వెంకటాలయ ప్రాంతంలో బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ 5 రోజుల పని వారాన్ని వెంటనే అమలు చేయాలనేది. ఇప్పటికే బ్యాంకు యాజమాన్యాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి అంగీకరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రావడం లేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ రంగాల్లో శనివారం, ఆదివారం సెలవులు ఉండగా, బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే నెలలో రెండు శనివారాలు మాత్రమే సెలవు ఉండటం అన్యాయమని వారు వాదిస్తున్నారు.
వారి రెండవ ప్రధాన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పిల్ఐ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని. ఈ స్కీమ్ లో తీవ్ర వివక్ష ఉందని, ఇది ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే విధంగా ఉందని ఆరోపిస్తున్నారు. PLI స్కీమ్ ను రూపొందించే ముందు యూనియన్లతో ఎలాంటి చర్చలు జరపలేదని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధమని UFBU నాయకులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఒకరోజు సమ్మె కేవలం హెచ్చరిక మాత్రమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మూడు రోజుల నిరవధిక సమ్మెకు, అక్టోబర్ 26 నుండి పూర్తిస్థాయి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ సమ్మెలో AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC అనే ఏడు యూనియన్లు ఐక్యంగా పాల్గొన్నాయి.