చింతకుంటలో గణేష్ నిమజ్జనానికి నీటి విడుదల
బీజేపీ డ్రామాలు
కరీంనగర్ సెప్టెంబర్21 (విజయ క్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Corporation) పరిధిలోని చింతకుంట వద్ద గణేష్ నిమజ్జనానికి అవసరమైన నీటిని ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా విడుదల చేయాలని గత రెండు మూడు రోజుల క్రితమే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేసినట్లు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి వరకు అందుబాటులో లేకపోవడంతో, ఈరోజు అందుబాటులోకి వచ్చిన వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు బీజేపీ నాయకులు చింతకుంట కెనాల్ వద్దకు వెళ్లి ధర్నా నిర్వహిస్తూ, తామే నీటిని విడుదల చేయిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం రాజకీయ డ్రామాగా ఆయన అభివర్ణించారు.
“బీజేపీ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలి. ప్రజలకు ఎప్పుడు, ఏ సౌకర్యాలు కల్పించాలో తెలంగాణలోని ప్రజా పాలన ప్రభుత్వానికి తెలుసు. ప్రజా అవసరాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం సరైన పద్ధతి కాదు. నేను కూడా గత రెండు మూడు రోజులుగా నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మెసేజ్‌ల ద్వారా, ప్రకటనల ద్వారా చింతకుంటలో గణేష్ నిమజ్జనానికి నీటి అవసరాన్ని తెలియజేశాను. ఆ మేరకే ఈరోజు నీటి విడుదల జరుగుతోంది. రేపటి వరకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా చింతకుంట మీదుగా ఎల్.ఎం.డి.కి నీరు చేరుతుంది” అని అంజన్ కుమార్ తెలిపారు