వృద్ధుల అనుభవాలు సమాజానికి మార్గదర్శకాలు
ఒంటరితనాన్ని వీడి కుటుంబంతో ఆనందంగా గడపాలి
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలి
హుజురాబాద్ (విజయక్రాంతి): వృద్ధుల అనుభవాలు భావితరాలకు విలువైన మార్గదర్శకాలని, వారి జీవిత పాఠాలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయని పలువురు వక్తలు అన్నారు. వయసు పెరిగినా మనసులో ఉత్సాహం, ఆలోచనల్లో సానుకూలత ఉంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని హుజురాబాద్ క్లబ్‌లో మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో, కౌన్సిలర్, పర్యావరణవేత్త వర్ధినేని రవీందర్‌రావు సౌజన్యంతో సీనియర్ సిటిజన్స్(Senior Citizens) అనుభవాల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారంఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన 70 ఏళ్లు పైబడిన సుమారు 150 మంది సీనియర్ సిటిజన్లు హాజరయ్యారు. వారిని శాలువాలతో సత్కరించి ఘనంగా గౌరవించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఒంటరితనం అనుభవించడం బాధాకరమని అన్నారు. వృద్ధులు కుటుంబ సభ్యులు, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఆప్యాయంగా సమయం గడపాలని సూచించారు. జీవితంలో సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వెచ్చించి సమాజానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.
సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మార్నింగ్ ఫ్రెండ్స్ బృందం అండగా ఉంటుందని నిర్వాహకులు భరోసా కల్పించారు. అనంతరం పలువురు వృద్ధులు తమ జీవిత అనుభవాలు, సమాజ సేవలో ఎదురైన పరిస్థితులు, కష్టాలను అధిగమించిన విధానాలను పంచుకున్నారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు వృద్ధుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు తరాల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్‌రెడ్డి, వేల్పుల రత్నం, ఆవునూరు సమ్మయ్య, ముక్కెర రాజు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, బెదరకోట జనార్దన్, చిరంశెట్టి వీరయ్య, మార్త రవీందర్, బత్తుల సమ్మయ్య, మామిడిపల్లి సాయి తదితరులు, మార్నింగ్ ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు.