సమ్మక్క ప్రధాన పూజారి తడన్ల చిన్నక్క మృతి
చిన్నక్క కుటుంబాన్ని పరామర్శించిన జాతర కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి
హుజురాబాద్, అక్టోబర్ 09: (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరలో(Sammakka Saralamma Jatara) గత 30 సంవత్సరాలుగా ప్రధాన పూజారిగా సేవలందించిన తడన్ల చిన్నక్క మృతి చెందారు. ములుగు జిల్లా(Mulugu District) గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చిన్నక్క గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
చిన్నక్క మృతి విషయం తెలుసుకున్న హుజురాబాద్ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గంట కిరణ్ కుమార్ రెడ్డి చల్వాయి గ్రామానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరలో మూడు దశాబ్దాలుగా పూజారిగా సేవలందించిన చిన్నక్క మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.