రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం
- కాపాడిన వారికి ప్రోత్సాహకాలు
- కరీంనగర్ సిపి గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 27(విజయక్రాంతి): రోడ్డు ప్రమాద(Road accident) బాధితులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులను కాపాడే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం(Karimnagar CP Ghouse Alam) తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహదారి భద్రతా పథకాలు, బాధితులకు తక్షణ సహాయం, అలాగే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన నేర చట్టాల సమర్థవంతమైన అమలుపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో నగదు రహిత అత్యవసర చికిత్స అందించడం రహదారి భద్రత పథకం ముఖ్య ఉద్దేశం.
బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే 7 రోజుల పాటు లేదా గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఉచిత అత్యవసర వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని స్థానిక ఆసుపత్రులు, ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బాధితులను కాపాడిన వ్యక్తికి రూ. 25,000 నగదు బహుమతి లభిస్తుందని, ఒక వ్యక్తి సంవత్సరంలో గరిష్టంగా 5 సార్లు ఈ ప్రోత్సాహకానికి అర్హత పొందవచ్చని సీపీ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏసీపీలు శ్రీనివాస్, శ్రీనివాస్ జి, వెంకటస్వామి, విజయకుమార్, స్వామి, సీఐలు, ఎస్సైలు , ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.