తొమ్మిది రోజులు అన్నదానం
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని 47వ డివిజన్ రాంనగర్ లోని సిద్ధార్థ హై స్కూల్ సమీపంలో కార్పొరేటర్ గాజ రమ-శివరాం ఛాలెంజ్ యూత్ క్లబ్' ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navaratri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకొని మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ(Distribution of Anna Prasadam) చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా విశేషమని, ఇది ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. భక్తులందరికీ నిరంతరాయంగా అన్నప్రసాదం అందించే బృహత్తర బాధ్యతను చేపట్టిన స్థానిక కార్పొరేటర్ గాజ రమ-శివరాంతో పాటు, ఉత్సాహంగా పనిచేస్తున్న ఛాలెంజ్ యూత్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛాలెంజ్ యూత్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.