కాంగ్రెస్‌నే బంద్ చేస్తారు!
- ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
- రోడ్ల నుంచి ఆసుపత్రుల వరకు అన్నీ అధ్వానమే
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ప్రజలకు ఉపయోగపడే పథకాలను, అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా బంద్ చేస్తోంద ని మాజీమంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) మండిపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ను బంద్ చేసేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం 286 మంది లబ్ధిదారులకు రూ.65.60 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను హరీశ్‌రావు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు గుంతలు లేని రోడ్లతో సిద్దిపేట అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏ రోడ్డు చూసినా గుంతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసు చూపుతోందని ఆరోపించారు.
అధికారంలోకి రాకముందు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కరెంట్ సరఫరాను 6 గంటలకు పరిమితం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మందులు అందుబాటులో లేక బయట నుంచి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా నిలిపివేశారని ఆరోపించారు.
ఆగిపోయిన అభివృద్ధి పనులు..
సిద్దిపేటలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 1000 పడకల ఆసుపత్రి పనులు, శిల్పారామం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్రావు ఆరోపించారు. వెటర్నరీ కళాశాలను తరలించకుండా కాపాడలేకపోయారని విమర్శించారు.
సాగునీటి విషయంలోనూ రైతులకు గోస మొదలైందని, నీటిని విడుదల చేయక రంగనాయకసాగర్ను ఎండబెట్టారని మండిపడ్డారు. వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ సిద్దిపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. ప్రజలు చూపుతున్న ఆదరణ, ఆప్యాయతను గుండెల్లో పెట్టుకుంటా. ఎల్లప్పుడూ ప్రజల సేవలోనే ఉంటా అని హరీశ్రావు అన్నారు.