సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖ అధికారుల సమన్వయ సమావేశం.
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): న్యాయ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయని కరీంనగర్ ప్రిన్సిపల్ స్టేషన్స్ కోర్టు న్యాయమూర్తి శివకుమార్ (Karimnagar Principal Stations Court Judge Shivakumar) అన్నారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన క్రిమినల్ చట్టాల ద్వారా న్యాయవ్యవస్థలో డిజిటలైజేషన్ , ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
నేర, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ద్వారా 'వన్ డేటా – వన్ ఎంట్రీ' విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసు దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, కోర్టు రికార్డులను సమగ్రంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అనుసంధానించడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందన్నారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-చార్జ్‌షీట్ల వినియోగం తప్పనిసరి అని, ఎలక్ట్రానిక్ విధానంలో ఫిర్యాదుల నమోదు, డిజిటల్ సమన్లు వర్చువల్ మోడ్‌లో సాక్షుల విచారణ వంటి ఆధునిక పద్ధతులు న్యాయ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నాయని వివరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కోర్టు సంబంధిత ప్రక్రియల్లో జాప్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ సమావేశానికి న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.