ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పోరుబాట
ఓట్ బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్
హుజురాబాద్ (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్(Congress in-charge Vodithala Pranav) అన్నారు. ఓటు హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ బచావో–దేశ్ బచావో' ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు.
ఆదివారం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పేరుతో ఎన్నికల వ్యవస్థలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన ఏకపక్ష నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో సామాన్య పౌరుడికి లభించిన అత్యంత శక్తివంతమైన హక్కు అని, ఆ హక్కును హరించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నాయకులు స్పష్టం చేశారు. దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. రాంలీలా మైదానంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కుల పరిరక్షణకు తమ మద్దతు ప్రకటించారు.