ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, అక్టోబరు 24 (విజయక్రాంతి): ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి(Government General Hospital) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్(GGH) ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీనతో కలిసి ఆసుపత్రిలోని ఎం ఎన్ డబ్ల్యు యూనిట్, ఫిమేల్ వార్డు, ఓపీ, సర్జికల్ తదితర వార్డులను పరిశీలించారు. పేషంట్లతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు.
రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జీజీహెచ్ లో రోగులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మరమ్మత్తుల కోసం కలెక్టర్ ఇటీవల 50 లక్షలు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కొనసాగుతున్న పనుల వివరాలను టీజీఎంఐడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న ప్యాచ్ వర్క్ లు, మరుగుదొడ్ల పనులు, గదుల్లో, కిటికీల పనులు, ఇతర మరమ్మతులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో చేపట్టి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరున్నర కోట్లతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ మిషన్లు ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సెంటర్ ను కలెక్టర్.. వైద్య అధికారులతో కలిసి సందర్శించారు. వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలో రోగుల సహాయకుల కోసం 35 లక్షలతో ఏర్పాటు చేసే విశ్రాంతి గదుల షెడ్డును పరిశీలించారు. కలెక్టర్ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.