ఏడుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ
బంగారు, వెండి ఆభరణాలు అపహరణ.. కేసు నమోదు
ఏడుపల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఏడుపల్లి గ్రామంలోని సాయి కృపా నగర్‌లో రెండు ఇళ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు నాజియా బేగం శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఏడుపల్లి పోలీసుల(Edupally Police)కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. నాజియా బేగం సెప్టెంబర్ 11న సాయంత్రం 5 గంటల సమయంలో తన తల్లి గ్రామమైన నీలా పేపర్ మిల్ గ్రామానికి వెళ్లారు. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న సయ్యద్ మాజిద్ సెప్టెంబర్ 17న రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి బీరువాల తాళాలు కూడా ధ్వంసం చేసి, వస్తువులను చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని మాజిద్ ఫోన్ ద్వారా నాజియా బేగంకు తెలియజేయగా, ఆమె వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించారు. తన బీరువాలో ఉన్న సుమారు 7 గ్రాముల బంగారు గొలుసు, 5 గ్రాముల బంగారు ఉంగరాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు.
అదేవిధంగా అద్దెకు ఉంటున్న మాజిద్ ఇంట్లో నుంచి సుమారు 7 గ్రాముల బంగారు ఉంగరాలు, 5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 24 తులాల వెండి పట్ట గొలుసులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు మేరకు ఏడుపల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.