ప్రభాత ఫేరిలో ఇస్కాన్ ప్రతినిధుల కీర్తనలు
జుక్కల్, నవంబర్ 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో(Madnur Mandal Center) కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కొనసాగుతున్న ప్రభాత ఫేరి కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. మద్నూర్‌లో కొనసాగుతున్న భక్తి కార్యక్రమాల గురించి తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖులు, హైదరాబాద్ ఇస్కాన్ ఆలయ ప్రతినిధులు ప్రభాత ఫేరిలో పాల్గొని భక్తులకు మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇస్కాన్ ప్రతినిధుల సంకీర్తనలు, భజనలు, భక్తి గీతాలు, నృత్యాలతో మద్నూర్ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి.
వందలాది మంది భక్తులు భజన బృందంతో అడుగులో అడుగు వేస్తూ గల్లీగల్లీ తిరగడంతో గ్రామమంతా భక్తి సందడి నెలకొంది. పలుచోట్ల భక్తులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. పాదపూజలు, హారతులతో భక్తులు తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామనామ స్మరణ, హరినామ సంకీర్తనలతో వీధులన్నీ మారుమోగగా, మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభాత ఫేరికి విశేష ఆదరణ అందించారు. వచ్చిన అతిథులకు స్థానిక భక్తులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు, ఇస్కాన్ ప్రతినిధులు ధర్మం, సంప్రదాయాలు, భక్తి మార్గం, ఆధ్యాత్మిక జీవనం, సమాజంలో ఐక్యత వంటి అంశాలపై ప్రసంగించారు. భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ధార్మిక చైతన్యం, సత్సంప్రదాయాల పట్ల అవగాహన, సమాజ ఐక్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. మద్నూర్‌లో కొనసాగుతున్న ప్రభాత ఫేరి కార్యక్రమానికి ఇతర ప్రాంతాల ప్రముఖులు సైతం ఆకర్షితులై పాల్గొనడం స్థానిక భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. భజనలు, సంకీర్తనలు, పూలవర్షాలు, భక్తుల హరివిల్లుల మధ్య సాగిన ప్రభాత ఫేరి మద్నూర్‌లో ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.