సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

28-10-2026 | 09:47pm

కామారెడ్డి, అక్టోబర్ 28 (విజయక్రాంతి):  జాతీయ సైబర్ భద్రత(National Cyber ​​Security) అవగాహన మాసోత్సవం సందర్భంగా కామారెడ్డి మెడికల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి  డీఎస్పీ  మధుసూధన్(DSP Madhusudhan), కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేశ్, దేవునిపల్లి ఎస్ఐ  రంజిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కామారెడ్డి డీఎస్పీ  మధుసూధన్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలు, రుణ యాప్‌ల ద్వారా వేధింపులు, ఇతరుల పేరుతో నటిస్తూ చేసే మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపవద్దని తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకూడదని, ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొనగా, సుమారు 300 మంది విద్యార్థులు సైబర్ నేరాల నివారణపై అవగాహన పొందారు.

మరిన్ని వార్తలు