గురుకులంలో అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
కొయ్యగుట్ట గురుకులంలో అసలేం జరుగుతోంది...?
ఒకవైపు విద్యార్థినీలకు అనారోగ్య సమస్యలు... మరోవైపు వంట పనులు
దుర్వాసనతో ఇబ్బందులు...
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం...
తనిఖీలు లేవు... పర్యవేక్షణ లేదు... ఆందోళనలో తల్లిదండ్రులు...
సమస్యలు వెల్లువెత్తుతున్నా... ఉన్నతాధికారుల మౌనం ఎందుకు..?
బాన్సువాడ, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థినీ, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య(Corporate level education)తోపాటు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు అందుతున్న వసతులు, పారిశుధ్యం, పాఠశాల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకవైపు కొందరు విద్యార్థినీలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం, మరోవైపు విద్యార్థినీలతో వంట పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల విద్యార్థినీలకు తాగునీటి సమస్య ఎదురవుతోందని, పరిసరాల్లో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గురుకులంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, విద్యార్థినీల నుంచి నేరుగా వివరాలు సేకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఇన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థినీల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ఉండాల్సిన గురుకులంలో ఇన్ని సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి..? పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్న అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా..? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
వంట పనులపై విచారణ జరపాలి
చదువుకోవాల్సిన విద్యార్థినీలను పాఠశాల పరిధిలోని వంట పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత..? విద్యార్థినీలను ఏ పనులకు, ఎవరి ఆదేశాలతో వినియోగించారు..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.
తనిఖీలు ఎక్కడ..? పర్యవేక్షణ ఏది..?
గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు అందుతున్న వసతులు, పారిశుధ్య పరిస్థితులు, భోజన నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే సమస్యలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణపై తల్లిదండ్రులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థినీలు చదువుపైనే దృష్టి సారించాల్సిన సమయంలో వసతుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న వార్తలు తమను కలవరపెడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
గురుకులంలో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర తనిఖీ నిర్వహించి, విద్యార్థినీల భద్రత, ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, భోజన ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అపోహలు అయితే వాస్తవాలను అధికారికంగా వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
పాఠశాలలో వరుసగా సమస్యలు తలెత్తుతున్నప్పటికీ యాజమాన్యం తగిన స్థాయిలో స్పందించడం లేదని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినీల ఆరోగ్యం, భద్రత, పారిశుధ్యం, ఆహారం వంటి అంశాల్లో నిర్లక్ష్యం జరిగితే అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినీలతో పనులు చేయించలేదు..: ప్రిన్సిపాల్
గురుకుల పాఠశాల విద్యార్థినీలతో వంట పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు, విద్యార్థినీలు జ్వరాల బారిన పడుతున్నారనే సమాచారంపై ‘విజయ క్రాంతి’ ప్రిన్సిపాల్ లక్ష్మీబాయిని వివరణ కోరింది. అయితే విద్యార్థినీలతో ఎలాంటి వంట పనులు చేయించడం లేదని ఆమె తెలిపారు.
అయితే విద్యార్థినీలు పాఠశాలలో వంట పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు ఉన్నప్పటికీ, ప్రిన్సిపాల్ మాత్రం అలాంటి పనులు చేయించడం లేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫొటోలపై, విద్యార్థినీలతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.