జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

03-11-2026 | 05:08pm

హాట్‌స్పాట్లను పరిశీలించిన ఎస్పీ.. సైన్‌బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశం

గద్వాల, నవంబర్ 3: జాతీయ రహదారి-44పై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు(SP Srinivas Rao) పోలీస్, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. మంగళవారం బీచుపల్లి నుంచి అలంపూర్ టోల్‌గేట్ వరకు జాతీయ రహదారిని పరిశీలించి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సందర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదాలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదాల నివారణకు అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, రహదారిపై లోపాలను సరిచేయడంతో పాటు వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్ల పక్కన సైడ్ స్టాపర్లకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలపకుండా హైవే పెట్రోలింగ్ నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రమాదాల నివారణకు పోలీస్, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఈ పర్యటనలో అలంపూర్, శాంతినగర్ సీఐలు ప్రదీప్, శంకర్, ఎస్సైలు రవి, తరుణ్ కుమార్, స్వాతి, సురేష్, హైవే ప్రాజెక్టు మేనేజర్ శ్రీధర్, ఇంజినీర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు