కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ సర్కార్‌

24-09-2026 | 03:46pm
  1. విద్యుత్‌ సంక్షోభానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం
  2. విద్యుత్ ప్లాంట్లను నిర్వీర్యం చేస్తున్నారు 
  3. విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు
  4. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి
  5. ప్లాంట్ల మూసివేతపై బీఆర్‌ఎస్‌ నిరసన
  6. కేటీపీపీ గేటు ముందు బైఠాయించిన నేతలు

గణపురం, సెప్టెంబర్‌ 24 (విజయ క్రాంతి):కరెంట్‌ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్‌ సర్కార్‌(Congress government) ఉందని  ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్‌, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి(BRS leader Palla Rajeshwar Reddy) ఆరోపించారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు గురువారం కేటీపీపీ సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ప్లాంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల తీరును నిరసిస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్‌, శంకర్‌నాయక్‌, బడే నాగజ్యోతి తదితరులు కేటీపీపీ ఎదుట బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలను సొంత పూచీకత్తుపై ప్లాంట్‌లోకి అనుమతించారు.

ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ అందించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేటీపీపీ, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాలకు సరిపడా బొగ్గు అందించకుండా ఉత్పత్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. జెన్‌కో బకాయిలు చెల్లించి విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.గోదావరి నీటిని వినియోగించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు విద్యుత్‌, సాగునీరు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. చేతకాకపోతే పదవుల నుంచి తప్పుకోవాలని పల్లా డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు