మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

02-11-2026 | 06:33pm

మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ

భూపాలపల్లి / మహాదేవపూర్, నవంబర్ 02 ( విజయక్రాంతి ) : మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు కల్పించాలని మధ్యాహ్నం భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ(Midday Meal Workers Union (AITUC)) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహాదేవపూర్ మండలంలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఆమె ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిత్యం భోజనం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరలను పెంచడంతో పాటు వంటకు అవసరమైన గ్యాస్ ఛార్జీలు, మెస్ ఛార్జీలను కూడా పెంచాలని కోరారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడంతో కార్మికులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు