హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

08-10-2026 | 06:37pm

రూ.4 వేల జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

భూపాలపల్లి,టౌన్ అక్టోబర్ 08 (విజయక్రాంతి): హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పెరుగు రమేష్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్‌కుమార్‌(Chief Justice J. Jeevan Kumar) గురువారం తీర్పు వెలువరించారు.

మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన అక్కపెళ్లి మల్లయ్య (38) 2020 సెప్టెంబర్‌ 4న అకినేపల్లి గ్రామంలోని కాకతీయ గ్రామీణ బ్యాంకు నుంచి రూ.50 వేల నగదు తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన పెద్దకోమటిపల్లికి చెందిన పెరుగు రమేష్‌ నగదును దోచుకోవాలనే ఉద్దేశంతో మల్లయ్యను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పర్లపల్లి వైపు తీసుకెళ్లాడు.

మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేసి వ్యవసాయ బావి వద్ద ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న మల్లయ్య తలపై బండరాయితో కొట్టి హత్య చేసి, అతని వద్ద ఉన్న రూ.50 వేల నగదును తీసుకుని మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేసి పరారయ్యాడు.

మల్లయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో మృతుడి తండ్రి మొగుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ నిహారిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో రమేష్‌ హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అప్పటి చిట్యాల సీఐ ఎం. సాయి రమణ నిందితుడిని అరెస్టు చేసి, ఆధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా సాక్షులను న్యాయస్థానంలో హాజరుపరిచి, నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వ న్యాయవాది ఎదులాపురం శ్రీనివాస్‌ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, విచారణలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఐపీఎస్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కేసులో ప్రస్తుత భూపాలపల్లి డీఎస్పీ ఎ. సంపత్‌రావు, చిట్యాల సీఐ సతీష్‌, ఎస్‌ఐ సురేష్‌, న్యాయస్థాన పర్యవేక్షణ అధికారి బి. రాజు, న్యాయస్థాన సమన్వయ అధికారి జి. వెంకన్న, సహాయ ఉప పరిశీలకుడు, న్యాయస్థాన విధుల్లో ఉన్న సిబ్బంది జ్యోతి, పి. శ్వేత తదితరులు కీలకంగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు