ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెరగాలి
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(government schools) విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, విద్యా ప్రమాణాలను మరింత పెంచేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం విద్యాశాఖ(Department of Education)పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో ప్రగతి సాధించేలా బోధన కొనసాగించాలని, విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు.
క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆయా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగేలా వినూత్న బోధనా పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ తెలిపారు. కేవలం సిలబస్ పూర్తి చేయడానికే పరిమితం కాకుండా, విద్యార్థులు పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకునేలా బోధన సాగాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు.
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులు, పోషకులతో మాట్లాడి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని అన్నారు. బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.
పరీక్షలపై విద్యార్థుల్లో భయం, ఆందోళన లేకుండా ఉపాధ్యాయులు వారికి ధైర్యం కల్పించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, అవసరమైన ప్రత్యేక తరగతులు నిర్వహించి, మెరుగైన ఫలితాలు సాధించేలా నిరంతరం మార్గనిర్దేశం చేయాలని సూచించారు. విద్యాబోధనతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలల్లో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, వెనుకబడిన విద్యార్థుల కోసం చేపడుతున్న ప్రత్యేక బోధన, బోర్డు పరీక్షల సన్నద్ధత తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.