నూతన ఆర్డీఓ కార్యాలయానికి స్థలం గుర్తించాలి
ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): నూతన ఆర్డీఓ కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి, భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని(Bhupalpally RDO Office) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ విభాగాల పనితీరుతో పాటు రెవెన్యూ అంశాల పురోగతిని సమీక్షించారు.
నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల సేకరణ, జీవో 76, 59 కింద వచ్చిన దరఖాస్తులు, హైకోర్టు కేసులు, పట్టభద్రుల ఓటరు నమోదు, ఆర్అండ్ఆర్, గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన భూసేకరణపై వివరాలు తెలుసుకున్నారు. జీవో 59 దరఖాస్తుల విచారణను వేగవంతం చేసేందుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.
నిర్దేశిత చెక్లిస్ట్ ప్రకారం పారదర్శకంగా విచారణ పూర్తి చేసి, అర్హులకు నిబంధనల మేరకు సేవలు అందించాలని ఆదేశించారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు సకాలంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.