సోషల్ మీడియా మెసేజ్ లతో సస్పెన్షన్ ఏంటి?

09-09-2026 | 06:34pm

బిఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమలత రెడ్డి(Former Municipal Chairman Premalatha Reddy) అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల విలేకరుల సమావేశం(BRS Party Councilors Press Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ.. 18వ వార్డు కౌన్సిలర్ సుగుణాకర్ గౌడ్ ను సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ ల ఆధారంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్ హాల్ లో నిబంధనలకు విరుద్ధంగా అసభ్యకరంగా మాట్లాడితే చర్యలు తీసుకోవచ్చు కానీ, బయట సోషల్ మీడియా(Social media)లో వచ్చే సందేశాలను సాకుగా చూపి ఎలాంటి నోటీసు, విచారణ లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్ పై ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, వెంటనే సుగుణాకర్ గౌడ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కౌన్సిలర్లందరం కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జమున, కౌన్సిలర్ సుగుణాకర్, కౌన్సిలర్ పానుగంటి సువార్త, మామిడాల రాజు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు