దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

02-11-2026 | 10:03pm

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District)లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి టీజీఐపాస్ (TG-iPASS) ద్వారా అందిన దరఖాస్తులు, మంజూరు చేసిన అనుమతులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Collector B. Satyaprasad) సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గత సమావేశం నుంచి ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం టీజీఐపాస్ ద్వారా అందిన దరఖాస్తులను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని, నిర్దేశిత గడువులోగా అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల(Entrepreneurs)కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.

అదేవిధంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న టీ-ప్రైడ్ పథకం(T-PRIDE scheme) కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.37.33 లక్షల పెట్టుబడి రాయితీని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి. మధులత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అనిల్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ కుమార్, ప్రాంతీయ రవాణా అధికారి సమ్దాని మహమ్మద్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి సుజాత, ఎన్ పి డి సి ఎల్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు