మహిళ అనుమానాస్పద మృతి
కుల్లిన స్థితిలో మృతదేహం లభ్యం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా(Medchal-Malkajgiri District), పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ లో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని పొదల్లో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, సుమారు పది రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు, యూనివర్సిటీ సిబ్బంది(University staff) గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహిళ హత్యకు(Murder of woman) గురైందా లేక ఇతర కారణాల చేత మృతి చెందిందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోచారం ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు. ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఘటనకు సమీపంలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.






