మొయినాబాద్ పిక్నిక్‌లో విషాదం.. ఊయల ఢీకొని బాలుడు మృతి

24-11-2026 | 04:46pm

హైదరాబాద్: సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన చిన్నారులకు తీరని విషాదం ఎదురైంది. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో జరిగిన ప్రమాదంలో పదేళ్ల బాలుడు అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

స్కూల్ పిక్నిక్‌లో (School Picnic) భాగంగా విద్యార్థులు మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చున్నారు. మరో నలుగురు విద్యార్థులు వెనుక నుంచి ఊయలను వేగంగా ఊపడంతో అది అదుపుతప్పింది. వెనక్కి వేగంగా వచ్చిన ఊయల పిల్లలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడు మృతి చెందగా.. యశ్వంత్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది (School Staff) అందుబాటులో లేరని ఆరోపణలు వస్తున్నాయి. పిల్లల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సిబ్బంది లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి మృతికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అభిరామ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిక్నిక్‌కు తీసుకెళ్లిన చిన్నారుల విషయంలో కనీస భద్రతా చర్యలు (Safety Measures) పాటించలేదని మండిపడుతున్నారు.

ఈ ఘటన బయటకు రాకుండా సంబంధిత వ్యవస్థలను మేనేజ్ చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ (Investigation) జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.

మరిన్ని వార్తలు