గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం
గాంధారి, నవంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్ (22), తండ్రి పోచయ్య, గాంధారిలో పని ముగించుకుని శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో కామారెడ్డి వైపు నుంచి వస్తున్న లారీ అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాద విషయం తెలుసుకున్న బూర్గుల్ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబం పేదది కావడంతో ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం (Compensation) అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో దాదాపు గంటపాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సదాశివనగర్ సీఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనకారులను శాంతింపజేశారు.