దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
టైరు పేలి అదుపుతప్పిన కారు
రెండేళ్ల చిన్నారితో సహా నలుగురికి గాయాలు
అలంపూర్: మక్తల్ నుంచి అలంపూర్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా జాతీయ రహదారిపై నారాయణపురం స్టేజి సమీపంలో మంగళవారం ఉదయం కారు టైరు పేలి ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అనిల్ కుమార్ (38), శిరీష (31), వారి పిల్లలు వేదన్ (5), వినయ వాసిని (2) గాయపడ్డారు.వేదన్ ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న మనోపాడు 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ రేణుక, పైలట్ ప్రేమానందం వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం చేర్పించారు.