జీఎస్టీ కౌన్సిల్ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council 57th Meeting) ముగిసింది. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్లు, వస్తువులపై పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు నిబంధనలను మరింత సులభతరం చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో చిన్న వ్యాపారులు ఈ-కామర్స్ రంగంలో మరింత సులభంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా సాధారణ జరిమానాను రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. పన్ను సంబంధిత కేసుల్లో అధికారుల అరెస్టు అధికారాన్ని తొలగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన పరిమితిని కూడా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది. మొత్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు లేకపోయినా.. నిబంధనలు, జరిమానాలు, చిన్న వ్యాపారులకు సంబంధించిన అంశాల్లో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.