కొత్త ఇండెక్స్ ఫండ్‌తో బంధన్ ఎంట్రీ..

22-11-2026 | 04:26pm

ముంబై: స్టాక్ మార్కెట్‌లో విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మరో కొత్త అవకాశం అందుబాటులోకి రానుంది. బంధన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా 'బంధన్ నిఫ్టీ కమోడిటీస్ ఇండెక్స్ ఫండ్(Bandhan Nifty Commodities Index Fund)'ను ప్రకటించింది. కమోడిటీస్ రంగానికి అనుసంధానమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ఈ కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ ఫండ్ నిఫ్టీ కమోడిటీస్ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్ కావడం విశేషం. కొత్త ఫండ్ ఆఫర్ (NFO) నవంబర్ 23, 2026న ప్రారంభమై.. డిసెంబర్ 3, 2026న ముగియనుంది.

ఏయే రంగాల్లో పెట్టుబడులు?

ఈ ఫండ్ ద్వారా ఒకే రంగానికి పరిమితం కాకుండా కమోడిటీస్ విలువ గొలుసులోని పలు విభాగాలకు అనుసంధానమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చమురు, సహజ వాయువు, లోహాలు, మైనింగ్, విద్యుత్, నిర్మాణ సామగ్రి, రసాయనాల వంటి రంగాలకు చెందిన సంస్థలు ఇందులో భాగంగా ఉంటాయి.

AI, డేటా సెంటర్లతో పెరుగుతున్న డిమాండ్!

భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ విస్తరణ, పెరుగుతున్న ఇంధన అవసరాలు కమోడిటీస్ రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్ల అభివృద్ధి కూడా ఈ రంగంలోని ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దోహదపడే అంశాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కమోడిటీస్‌కు అనుసంధానమైన కంపెనీల్లో పెట్టుబడులకు కొత్త మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఫండ్‌ను తీసుకొచ్చినట్లు బంధన్ AMC వెల్లడించింది.

ఇప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియోకు అదనపు అవకాశం!

బంధన్ AMC సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ.. ఆర్థిక అభివృద్ధిలో కమోడిటీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ, తయారీ రంగ ఆశయాలు, ఇంధన అవసరాలు, AI, డేటా సెంటర్ల వృద్ధి ఈ రంగానికి కొత్త డిమాండ్‌ను తీసుకొస్తున్నాయని వివరించారు.

కమోడిటీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఎక్కువ సమయం, భారీ పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అవసరమైన సామర్థ్యాలు కలిగిన సంస్థలకు ఈ పరిస్థితులు అనుకూలంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. విభిన్న కమోడిటీస్ రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ఈ వృద్ధిలో భాగస్వాములు కావడానికి కొత్త ఫండ్ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.

ఎలా పెట్టుబడి పెట్టాలి?

ఈ ఫండ్‌లో లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు (RIAs), ఆన్‌లైన్ పెట్టుబడి వేదికలు లేదా నేరుగా బంధన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే, ఈ ఫండ్ ఇప్పటికే విభిన్న రంగాల్లో పెట్టుబడులు కలిగిన ప్రధాన పోర్ట్‌ఫోలియోకు అదనపు పెట్టుబడి అవకాశంగా ఉపయోగపడవచ్చని సంస్థ పేర్కొంది. ఇండెక్స్ ఫండ్ అయినప్పటికీ మార్కెట్ హెచ్చుతగ్గులు, రంగాల వారీగా వచ్చే రిస్క్‌లను పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌ను పరిశీలించడం మంచిది.

మరిన్ని వార్తలు