వామ్మో.. కోతుల బెడద!

31-10-2026 | 09:12am
  1. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచారం.. భయాందోళనలో పట్టణ ప్రజలు
  2. గతంలో పలువురిపై దాడులు.. ఒకరు మృతి చెందిన ఘటన
  3. రూ.2 లక్షలు ఖర్చు చేసినా తగ్గని కోతుల బెడద..
  4. శాశ్వత పరిష్కారం ఎప్పుడంటున్న ప్రజలు

హుజురాబాద్,అక్టోబర్31: (విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణ ప్రజలకు కోతుల బెడద రోజురోజుకూ పెద్ద సమస్యగా మారుతోంది. గుంపులు గుంపులుగా కోతులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో ప్రజలు(Huzurabad Residents) తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలన్నా, వీధుల్లో నడవాలన్నా, చేతిలో సంచులు పట్టుకుని వెళ్లాలన్నా ప్రజలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కోతుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి కోతులు వచ్చి దాడి చేస్తాయోనన్న భయం పట్టణ ప్రజలను వెంటాడుతోంది.

గతంలో దాడులు.. ఒకరు మృతి

హుజురాబాద్ పట్టణంలో కోతుల దాడులు కొత్తేమీ కాదు. గతంలో అనేక సందర్భాల్లో కోతులు ప్రజలపై దాడులకు(Monkey Attacks) పాల్పడిన ఘటనలు ఉన్నాయి. పలువురు గాయపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కోతుల దాడిలో ఒకరు మృత్యువాత పడిన ఘటన పట్టణ ప్రజలను అప్పట్లో తీవ్ర కలవరానికి గురిచేసింది. అయినప్పటికీ కోతుల బెడదకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రజలు నేటికీ భయంతోనే వీధుల్లో తిరుగుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో కోతులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, ఇంటి ఆవరణలో ఆరబెట్టిన వస్తువులను చిందరవందర చేయడం, చెట్లపై నుంచి ఇళ్లపైకి దూకుతూ హడావుడి సృష్టించడం వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల చేతిలో ఆహార పదార్థాలు కనిపిస్తే కోతులు వెంటపడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు కోతుల గుంపులను చూసి భయపడుతున్నారు. ఒంటరిగా నడవడానికి కూడా జంకుతున్నారు. వృద్ధులు ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లాలన్నా వెనుకడుగు వేస్తున్నారు. మహిళలు ఇంటి ముందు పనులు చేసుకునే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. కోతులు ఒక్కసారిగా మీదకు వస్తే ఏం చేయాలో తెలియక ప్రజలు పరుగులు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రూ.2 లక్షలు ఖర్చు చేసినా ఫలితం ఏదీ?

కోతుల బెడదను నివారించేందుకు గతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోతులను పట్టించి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సుమారు రూ.2 లక్షల నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టణంలో కోతుల సంచారం తగ్గకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. నిధులు ఖర్చు చేసినా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోతులను తరలించిన కొద్ది రోజులకే మళ్లీ గుంపులు గుంపులుగా కనిపిస్తుండటంతో చేపట్టిన చర్యలు తాత్కాలికంగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

*అధికారులు స్పందించాలి..  శాశ్వత పరిష్కారం చూపాలి:  లావణ్య గృహిణి.

కోతుల బెడదపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కేవలం కోతులను పట్టించి తరలించడంతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, వాటి సంచారానికి కారణమవుతున్న పరిస్థితులను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. అవసరమైన చోట్ల ప్రత్యేక చర్యలు చేపట్టి, అటవీ శాఖ అధికారుల సహకారంతో కోతుల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కోతుల దాడుల్లో గాయాలు, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో అధికారులు మరింత నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.

ప్రజల ప్రశ్న ఒక్కటే.. కోతుల బెడద ఎప్పుడు తీరుతుంది?

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కోతుల సంచారాన్ని అరికట్టేందుకు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఇప్పటికైనా సమన్వయంతో చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. గతంలో జరిగిన దాడులు పునరావృతం కాకుండా చూడాలని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయం లేకుండా రోడ్లపై తిరిగే పరిస్థితులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిధులు ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే ఆ నిధుల వినియోగం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్ పట్టణానికి కోతుల బెడద నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందో, అధికారులు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు