అర్హుల ఓటు హక్కుకు భంగం కలగొద్దు!
- ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ దేవసేన
- ఓటర్ల జాబితాపై అధికారులతో సమీక్ష
ఇల్లెందు, అక్టోబరు 28 (విజయక్రాంతి): అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. దేవసేన(District Electoral Roll Observer A. Devasena) అధికారులను ఆదేశించారు. బుధవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఎలక్టోరల్ రోల్, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవసేన మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఫారం-6, 6ఏ, 7, 8 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. బీఎల్ఓలతో ఇంటింటి సర్వే నిర్వహించి, క్షేత్రస్థాయిలో గుర్తించిన మార్పులను జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు.
అధికంగా ఓటర్ల చేర్పులు, తొలగింపులు జరిగిన ప్రతి నియోజకవర్గంలోని 20 పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలన్నారు. ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించడంతోపాటు నోటీసులు, విచారణ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. యువ ఓటర్ల నమోదు, ఎపిక్ కార్డుల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా నిర్వహణ కోసం జిల్లాలో 30 మంది ఏఈఆర్ఓలు, 28 మంది అదనపు ఏఈఆర్ఓలు, 123 మంది సూపర్వైజర్లు, 1,127 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎపిక్ కార్డుల కవరేజీ 99.99 శాతం పూర్తయిందన్నారు. జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు 5,608 మంది, 85 ఏళ్లు పైబడిన వృద్ధ ఓటర్లు 13,130 మంది, ఎన్నారై ఓటర్లు 28 మంది ఉన్నట్లు వివరించారు.
ఫారం-6 దరఖాస్తులు 13,119, ఫారం-6ఏ దరఖాస్తులు 34, ఫారం-7 దరఖాస్తులు 800, ఫారం-8 దరఖాస్తులు 27,033 పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో బి. రాహుల్, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.