ఆదివాసీ గ్రామంలో విద్యుత్ వెలుగులు

15-09-2026 | 03:32pm

ఆధార్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో.  

కమల మనోహర రావు ఫౌండేషన్ సహకారంతో స్ట్రీట్ లైట్లు, సోలార్ ల్యాంపుల ఏర్పాటు.

పినపాక సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, అమరావరం గ్రామపంచాయతీ పరిధిలోని తీర్లాపురం ఆదివాసీ గ్రామంలో విద్యుత్ సౌకర్యం(Electricity facility) లేక గ్రామ ప్రజలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటిలోనే పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితిని గుర్తించిన ఆధార్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ఆధార్ స్వచ్ఛంద సంస్థ చొరవతో, పొట్లపల్లి కమల మనోహర రావు ఫౌండేషన్ సహకారంతో గ్రామంలో నాలుగు సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చిన్నారులు రాత్రివేళ చదువుకోవడానికి, గ్రామస్తులు సంప్రదాయ సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడేలా నాలుగు సోలార్ ల్యాంపులను గ్రామస్తులకు అందజేశారు.

విద్యుత్ సౌకర్యం లేని తమ గ్రామంలో వెలుగులు ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లల చదువుకు, రాత్రివేళల్లో మహిళలు, వృద్ధులు, గ్రామ ప్రజల రాకపోకలకు ఈ లైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. తమ గ్రామ సమస్యను గుర్తించి సహాయం అందించిన ఆధార్ స్వచ్ఛంద సంస్థ,  పొట్లపల్లి కమల మనోహర రావు ఫౌండేషన్‌కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆధార్ సంస్థ నిర్వాహకుడు తోలెం రమేష్ మాట్లాడుతూ, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ప్రతి ఆదివాసీ గ్రామానికి అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా పిల్లల విద్యకు చీకటి అడ్డంకిగా మారకూడదని అన్నారు. తీర్లాపురం వంటి విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి సాధ్యమైనంత మేరకు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొట్లపల్లి కమల మనోహర రావు ఫౌండేషన్ ప్రతినిధి అనిరుధ్, సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ మోహన్ రావు, ఆధార్ సంస్థ సభ్యులు,నవీన్, రమేష్ గ్రామ పెద్దలు నూప రామయ్య, నూప వాసు, బడిశ రమేష్ తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు