19 అడుగులకు చేరిన గణప సముద్రం సరస్సు నీటిమట్టం
రామప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తున్న వరద నీరు
ఆయకట్టు రైతులకు ఊరట
పంటలపై చిగురిస్తున్న ఆశలు
గణపురం, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కాకతీయులు నిర్మించిన గణప సముద్రం సరస్సు(Ganapa Samudram Lake) నీటిమట్టం ఆదివారం నాటికి 19 అడుగులు దాటాయి. గతంలో 16 అడుగులు ఉన్న నీటిమట్టం రామప్ప నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా బుద్ధారం వంగపెల్లి వాని చెరువు నిండడంతో చెరువు మత్తడి ద్వారా వరద నీరు గణప సముద్రానికి చేరుతుంది. మొన్నటి వరకు నాట్లు వేసి నిరాశతో ఉన్న రైతులకు నీటిమట్టం పెరగడంతో కొంత మేర ఆశలు చిగురిస్తున్నాయి.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలుమార్లు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రం సరస్సును నింపేందుకు కృషి చేశారు. గత నెల రోజులుగా ఎలాంటి వర్షాలు లేకున్నప్పటికీ సరస్సులోకి రెండు అడుగుల నీరు చేరడం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. నిరంతరాయంగా రామప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రం సరస్సు కు వరద నీరు చేరి మరో ఐదు అడుగులకు పెరిగితే ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగవుతుందని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి ఆయకట్టు పంటలు సాగయ్యే విధంగా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
25 అడుగులకు చేరే దాకా సరస్సును నింపాలి
గణప సముద్రం సరస్సు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే 25 అడుగులకు నీటిమట్టం చేరేవరకు నింపాలి. రామప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా నిరంతరా యంగా నీటి సరఫరా కొనసాగించాలి. ఇప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులుపెట్టి వరి నాట్లు వేసుకున్నారు. వారికి నష్టం జరగకుండా చూడాలి సరస్సు ఆయకట్టు కాలువలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి కాలువల్లో చెత్తాచెదారం పేరుకు పోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అధికారులు ప్రజాప్రతి నిధులు స్పందించాలి.
-దూలం కుమారస్వామి గౌడ్ , సరస్సు ఆయకట్టు రైతు