11 ఏళ్లలో ఏం సాధించారు..?
టీబీజీకేఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి:కె.సారయ్య
ఇల్లెందు టౌన్, సెప్టెంబర్15 (విజయక్రాంతి): సింగరేణి(Singareni)లో 11 ఏళ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ కార్మికుల కోసం సాధించిన విజయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి వైద్యశాల వద్ద నిర్వహించిన ఫిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ మారుపేర్లు, ఇన్కమ్ ట్యాక్స్, డిస్మిస్ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలమైందని విమర్శించారు.
2018–22 మధ్య ఒక్క స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించలేదని, ఏఐటీయూసీ రెండేళ్లలో ఐదు సమావేశాలు నిర్వహించి కార్మిక సమస్యలపై చర్చించిందన్నారు. పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ భారం తగ్గించేలా యాజమాన్యంతో ఒప్పందం సాధించామని తెలిపారు. 2016 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష పేపర్ విక్రయ ఆరోపణలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “11 ఏళ్లలో మీరు ఏం సాధించారో చెప్పండి.. రెండేళ్లలో ఏఐటీయూసీ ఏం సాధించిందో మేము కార్మికుల ముందుంచుతాం” అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఉపాధ్యక్షుడు దాసరి రాజారామ్, సివిల్ ఫిట్ కార్యదర్శి వి. జయరాజు తదితరులు పాల్గొన్నారు.