అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

17-10-2026 | 07:51pm

పినపాక ఎమ్మెల్యే ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు.

పినపాక మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

పారదర్శక ప్రజా పంపిణీ వ్యవస్థకు ప్రభుత్వం ప్రాధాన్యం

పినపాక,(విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం, ఆహార భద్రత(welfare and food security)కు పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌ఓ) కార్యాలయంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా రేషన్ సరుకులు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఆహార భద్రతకు ముఖ్యమైన ఆధారమని, ప్రభుత్వ నిబంధనలు, అర్హతలను బట్టి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఉపయోగపడతాయని వివరించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పినపాక నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి, పేద కుటుంబాల సంక్షేమానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఆర్‌ఓ, సంబంధిత శాఖల అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు