ఎల్ఎస్ఎన్ కార్మికులకు రేపటిలోగా బోనస్ జమ
ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవతో సమస్యకు పరిష్కారం
టేకులపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఎల్ఎస్ఎన్ (LSN) కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సింగరేణి యాజమాన్యం(Singareni Management) నుంచి రావాల్సిన రూ.5,500 బోనస్ చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
అర్హులైన కార్మికులకు సంబంధించిన బోనస్ మొత్తాన్ని సింగరేణి యాజమాన్యం ఎల్ఎస్ఎన్ కంపెనీ ఖాతాలో జమ చేసింది. మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో యూనియన్ నాయకులు ఇల్లందు సింగరేణి జీఎంతో చర్చలు జరిపారు. అనంతరం ఎల్ఎస్ఎన్ కంపెనీ జీఎం శివతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి, బోనస్ మొత్తాన్ని బుధవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంటలోపు కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు.
ఇందుకు కంపెనీ జీఎం సానుకూలంగా స్పందించి, నిర్ణీత సమయంలో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల కోసం చొరవ చూపిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు యూనియన్ నాయకులు, కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆగస్టు నెల వేతనం, 15 నెలల పీఎఫ్ బకాయిలు, వార్షిక బోనస్ పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని, ఇందుకోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోచికొండ సత్యనారాయణ, కోయగూడెం ఓబీ అండ్ కోల్ ఐఎన్‌టీయూసీ యూనియన్ అధ్యక్షుడు ముచ్చ సుధాకర్‌తో పాటు పలువురు యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.