భద్రాచలం ఆలయ పునఃనిర్మాణాల్లో వేగం పెంచాలి
రాష్ట్ర మంత్రి పొంగులేటి
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం
గత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు: విలేఖరుల సమావేశంలో : మంత్రి పొంగులేటి
భద్రాచలం, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి): భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం దర్శించుకున్న అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి సమీక్షా సమావేశం క్షేత్రస్థాయిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భద్రాచలం ఆలయ నిర్మాణ పనులు ప్రతీ రోజు పకడ్బందీగా చేయాలని,మూడు షిఫ్ట్ లుగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని 24గంటలు పని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25శాతం పనులే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహింస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
దేవాదాయశాఖపై తమకు ఎంతో నమ్మకం ఉందని, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఆలయ నిర్మాణాలు జరిపించాలని సూచించారు. ఆలయానికి తీసుకొనే రాళ్ళ నాణ్యత ఖచ్చితంగా ఉండాలని, మేలిమి కలిగిన వాటిని నిర్మాణాలకు ఉపయోగించాలని సంబంధిత నిర్మాణ సిబ్బందికి తెలిపారు. ఎటువంటి అవసరాలు ఉన్న దగ్గర ఉండీ చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్‌ను మంత్రి ఆదేశించారు. ఆలయ నిర్మాణాలకు ఏ నిర్ణయాలైన తక్షణమే తీసుకోవాలని,వాటి జాబితా ప్రణాళిక ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల అందించాలన్నారు.
ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపి,అనుమతి తీసుకొని వాటిని తక్షణమే మంజూరు చేయిస్తానని అధికారులకు మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆలయ ఈ.ఓ దామోదర్, క్షేత్ర కన్సల్టెంట్ ప్రతినిధులు సత్య కృష్ణ, సూర్యనారాయణమూర్తి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు
గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే.. మనకు పోలవరం ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవస్థాన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామ పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేయడం బాధాకరమని అన్నారు.
ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం వరదలు లేకున్నా... భవిష్యత్ లో భద్రాచలం నుంచి ములుగు వరకు సాధారణం కంటే 20-25 అడుగుల వరకు అధికంగా బ్యాక్ వాటర్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో సి డబ్ల్యూ సి, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు విన్నవించినా.. వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని .. తెలంగాణలో ముంపు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
పార్లమెంట్ సమావేశాల నాటికి తెలంగాణ ఎంపీలు, గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. పోలవరం ప్రభావంతో జరిగే వరద ముప్పు తీవ్రతను వివరించి.. పునః పరిశీలించాలని కోరతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో..: కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పాల్గొన్నారు.






