నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
- రైతులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి
- మండల వ్యవసాయ అధికారి శీలం చంద్రశేఖర్ రెడ్డి
దమ్మపేట, నవంబర్ 27(విజయ క్రాంతి): వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరి కొయ్యలు(Paddy Stubble), పంట అవశేషాలను రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని మండల వ్యవసాయ అధికారి(Agricultural Officer) శీలం చంద్రశేఖర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం దమ్మపేట మండలంలోని గుండుగులపల్లి గ్రామంలో బిక్కసాని రాజశేఖర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను కాల్చిన విషయం తెలుసుకున్న దమ్మపేట మండల వ్యవసాయ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుకు వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలు, పర్యావరణానికి, భూసారానికి జరిగే నష్టాలను వివరించి అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతుకు సూచించారు.
వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలోని మిత్ర సూక్ష్మజీవులు, సేంద్రియ పదార్థాలు నశించి భూసారం తగ్గే ప్రమాదం ఉందని, నేలలోని పోషకాలు దెబ్బతినడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. పొగ కారణంగా ప్రజల ఆరోగ్యానికి, పశువులకు ఇబ్బందులు కలగడంతో పాటు అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి ఓ ఎం ఎస్ నెం.27, తేదీ 10-07-2017 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు, బయోమాస్‌ను కాల్చడంపై ఉన్న నిషేధ నిబంధనలను రైతులు తప్పనిసరిగా గమనించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
రైతులు వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నడం, మల్చింగ్ పద్ధతిలో ఉపయోగించడం లేదా కంపోస్టుగా తయారుచేసుకోవడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని సూచించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.
ఇకపై మండల పరిధిలో ఎక్కడైనా వరి కొయ్యలను కాల్చినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మండల వ్యవసాయ అధికారి ఈ చంద్రశేఖర్ రెడ్డి కోరారు.