గోదావరి వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి
క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు,గోదావరి వరద(Godavari flood) పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షపాతం, గోదావరి నీటిమట్టం, రహదారులు, వంతెనలు, పాఠశాలలు, పంటలు, ఇళ్ల నష్టంపై మండలాల వారీగా వివరాలు తెలుసుకున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాణహిత నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం నీటిమట్టం 25 నుంచి 30 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, సిబ్బంది విధులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
జిల్లాలోని పాత వంతెనలు, కల్వర్టులు, రహదారులను పరిశీలించి ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ములకలపల్లి వద్ద దెబ్బతిన్న వంతెనపై రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దెబ్బతిన్న బ్రిడ్జి పనికి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. తాగునీరు, మధ్యాహ్న భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాలతో పంటలకు ఎలాంటి నష్టం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటలు, ఇళ్ల నష్టం తదితర పరిస్థితులను పరిశీలించి నష్టం ఉంటే వెంటనే నివేదించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు హెడ్‌క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.