ఆదివాసీలపై వివక్షను సహించం

19-09-2026 | 05:53pm

ఏజెన్సీ చట్టాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి

తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలెం కోటి

పినపాక,(విజయక్రాంతి): పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ(Edulla Bayyaram Gram Panchayat) పరిధిలో ఆదివాసీలపై కుల వివక్ష, దురహంకార ప్రదర్శనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీల హక్కుల పోరాట సమితి(Adivasi Rights Struggle Committee) తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలెం కోటి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆలెం కోటి ఆరోపించారు. 1/70, 1/77, పీఓటీ, వడ్డీ నిషేధ చట్టం తదితర నిబంధనలను ఉల్లంఘిస్తూ బినామీ పేర్లతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చి చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఏడూళ్ల బయ్యారంగ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన సనప శంకర్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే బాధిత కుటుంబంతో కలిసి పినపాక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.

అలాగే సంబంధిత సర్పంచ్, ఉపసర్పంచ్‌లపై ఉన్నతాధికారులకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆదివాసీలపై కుల వివక్షకు పాల్పడినట్లు తమకు ఆధారాలు లభిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం-1989, సవరణ నిబంధనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆలెం కోటి తెలిపారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు తుడుందెబ్బ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు