జిల్లాలో వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశం
పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు పరిశీలనలో డీసీపీ రామ్‌రెడ్డి
పెద్దపల్లి, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పెద్దపల్లి పోలీసులు పటిష్ట భద్రతా(Robust security) ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్(decent function hall)లో వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్రలో క్రమశిక్షణ పాటించాలని, పోలీసులు సూచించిన మార్గాల్లోనే ఊరేగింపును నిర్వహించాలని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించిన డీసీపీ
సమన్వయ సమావేశం అనంతరం డీసీపీ బి. రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు మినీ ట్యాంక్‌బండ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లకుండా బారికేడింగ్, లైటింగ్, పోలీస్ బందోబస్తు, రాకపోకల నియంత్రణ, విద్యుత్ భద్రత వంటి అంశాలపై సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రక్షణ చర్యలు, అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను డీసీపీ ఆదేశించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలు, అత్యవసర వాహనాలకు ప్రత్యేక మార్గం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ తెలిపారు. వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణతో పాటు పోలీస్ అధికారులు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్, ఇరిగేషన్, మత్స్య, వైద్య ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.