కొరాట-చనాకా బ్యారేజ్ పై విజిలెన్స్ విచారణ జరిపించాలి

31-10-2026 | 10:26pm

ఎమ్మెల్యే పాయల్ డిమాండ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కొరాట–చనాకా బ్యారేజ్ కాలువలు నాసిరకం పనుల కారణంగా దెబ్బతింటూ, కూలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. బ్యారేజి నిర్మాణం పై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం కొర్టా–చనాకా బ్యారేజ్(Korta-Chanaka Barrage)ను సందర్శించి, నిర్మాణ పనులను, కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ బ్యారేజ్ పనులకు సంబంధించిన ఒప్పందాలు, టెండర్లు, అంచనాలు, నిధుల విడుదల, పనుల అమలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వంలో ఈ పనుల కేటాయింపు, అమలు, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల(Political leaders) పాత్రను సైతం విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని అధికారికంగా అంచనా వేసి, బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులు, ఇతరుల నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు. సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉండటం, నిర్మించిన పనులు సైతం దెబ్బతినడం వల్ల రైతులకు ఆశించిన ప్రయోజనం అందడం లేదన్నారు.

రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. విచారణలో తప్పులు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు