బీఆర్ఎస్ లోకి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు...?
భార్గవ్ దేశ్పాండే కారెక్కడంతో జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు..
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ యువ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే(former DCC president Bhargav Deshpande) బీఆర్ఎస్(BRS)లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. తన తాత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ విఠల్ రావు దేశ్పాండే(Former MLA late Vitthalrao Deshpande) నుండి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న భార్గవ్ పిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో క్రియాశీల నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు.
ఐతే ఆదిలాబాద్ నియోజవర్గం నుండి 2011 లోనే టికెట్ ఆశించిన చిన్న వయస్సు కారణంగా టికెట్ రాలేదు. అనంతరం 2014 లో పార్టీ తరఫున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసే వారికే టికెట్ ఇవ్వాలని ధిక్కార స్వరం వినిపించిన భార్గవ్ దేశ్పాండే తో పాటు పలువురు పార్టీ సస్పెండ్ కు గురై మళ్ళీ పార్టీలో చేరారు. కానీ అప్పటి నుండి భార్గవ్ కాంగ్రెస్ కు కొంత దూరంగానే ఉన్నారు. ఐతే ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ అద్యక్షులు జోగు రామన్న నేతృత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనీ పార్టీలో చేరాలని పిలుపు రావడంతో ఈనెల 12వ తేదీ గులాబీ కండువా కప్పుకోనునట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే జిల్లా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలనుందని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.