మొక్కల మాటున నిర్లక్ష్యం.. పర్యవేక్షణ ఏది?
బోథ్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని పోచ్చార జలపాతం(Pochara Waterfall) వద్ద అటవీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న నర్సరీ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. దాదాపు 50 వేల మొక్కలను పెంచేందుకు నర్సరీని నిర్వహిస్తున్నారు. అయితే నర్సరీ నిర్వహణ పట్ల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన నర్సరీ పిచ్చి మొక్కలతో నిండిపోతున్నది. వాస్తవానికి నర్సరీలోని మొక్కలు అక్టోబర్ నెల నాటికి 2 మీటర్ల ఎత్తులో మొక్క పెరగాల్సి ఉంది. అయితే మొక్కలు మీటర్ సైతం పెరగకపోగా ప్లాస్టిక్ కవర్ల(Plastic covers) చుట్టూ మొక్కలు కనిపించకుండా పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. కలుపు తీయించకుండా అలాగే వదిలేశారన్నారు.
కూలీలు రాక
నర్సరీలో కలుపు తీసేందుకు కూలీలు రావడం లేదని తెలిసింది. గత ఏడాది కూలీలకు అందాల్సిన కూలీ డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోవడంతో పూరి పని చేసేందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. నర్సరీలో కలుపులో నివారణ కోసం పనిచేసిన వారికి పూలే డబ్బులు రాక అటవీశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
సారు సతాయిస్తున్నాడు
కూలి పనిచేసి డబ్బులు అడుగుతే నర్సరీని పర్యవేక్షిస్తున్న సారు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని కూలి పని చేసిన తోకల లక్ష్మివా పోయింది. తనతోపాటు మరికొంతమంది కూలీలకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. ఉపాధి హామీ డబ్బులు రాకపోతే మేం చేసేదేమీ లేదు అంటూ ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితులు అంటున్నారు. నర్సరీ నిర్వహణపై అధికారులు పర్యవేక్షిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడే ఆస్కారం ఉంది.