పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మోటకొండూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్..
ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): మోటకొండూరు పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్(District SP Akshansh Yadav) ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలు, పోలీస్ శాఖ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో మోటకొండూరు ఎస్‌హెచ్‌ఓ బి. కుమారస్వామి, ఏఎస్ఐ ప్రకాశ్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.